Matthew 9

యేసు కపెర్నహూముకు తిరిగి వచ్చి పక్షవాత రోగిని బాగు చేయడం (మార్కు 2:3-12. లూకా 5:18-36)

1యేసు పడవ ఎక్కి సముద్రం దాటి తన స్వగ్రామం వచ్చాడు. 2కొంతమంది ఒక పక్షవాత రోగిని అతని మంచం మీదే ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. యేసు వారి విశ్వాసం చూసి, బాబూ, ధైర్యం తెచ్చుకో. నీ పాపాలకు క్షమాపణ దొరికింది, అని ఆ పక్షవాత రోగితో చెప్పాడు.

3ధర్మశాస్త్ర పండితులు కొంతమంది ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, అని తమలో తాము అనుకున్నారు.

4యేసు వారి ఆలోచనలు గ్రహించి, “మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచనలు చేస్తున్నారు? 5‘నీ పాపాలు క్షమించాను’ అని చెప్పడం తేలికా? ‘లేచి నడువు’ అని చెప్పడం తేలికా? 6అయినా పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి, ఆ పక్షవాత రోగితో, “నీవు లేచి నీ మంచం తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు.

7అతడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. 8ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఇంత అధికారం మనుషులకిచ్చిన దేవుణ్ణి వారు స్తుతించారు.

మత్తయికి పిలుపు (మార్కు 2:14. లూకా 5:27-29)

9యేసు అక్కడనుంచి వెళ్తూ పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒకతన్ని చూశాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అన్నాడు. అతడు లేచి ఆయనను అనుసరించాడు.

10యేసు మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలామంది పన్ను వసూలు చేసే వారూ పాపులూ వచ్చి ఆయనతో, ఆయన శిష్యులతో కూర్చున్నారు.

11పరిసయ్యులు అది గమనించి, “మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తింటున్నాడేంటి?” అని ఆయన శిష్యుల్ని అడిగారు.

12యేసు అది విని, “ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. రోగులకే అవసరం. 13నేను పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికే వచ్చాను, నీతిపరులను కాదు. కాబట్టి మీరు వెళ్ళి ‘మీరు బలులు అర్పించడం కాదు, కనికరం చూపించాలనే కోరుతున్నాను’ అనే వాక్యభావం నేర్చుకోండి” అని చెప్పాడు.

14అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పరిసయ్యులూ మేమూ తరచుగా ఉపవాసం ఉంటాము గానీ నీ శిష్యులు ఉపవాసం ఉండరెందుకు?” అని ఆయనను అడిగారు. 15యేసు వారికిలా జవాబిచ్చాడు. “పెళ్ళికొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్ళి వారు విచారంగా ఉంటారా? అయితే పెళ్ళికొడుకును వారి దగ్గర నుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి. అప్పుడు వారు ఉపవాసం ఉంటారు.

రెండు ఉపమానాలు (మార్కు 2:21. లూకా 5:36-39)

16“ఎవడూ పాత బట్టకు కొత్త బట్ట అతుకు వేయడు. వేస్తే ఆ అతుకు బట్టను చింపేస్తుంది. ఆ చినుగు మరింత పెద్దదవుతుంది.

17పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయరు. పోస్తే ఆ తిత్తులు పిగిలిపోయి, ద్రాక్షారసం కారిపోతుంది. తిత్తులు పాడైపోతాయి. అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోస్తారు. అప్పుడు ఆ రెండూ చెడిపోవు.”

యేసు రక్త స్రావ రోగమున్న స్త్రీని బాగు చేయడం, యాయీరు కుమార్తెను బ్రతికించడం (మార్కు 5:22-43. లూకా 8:41-56)

18ఆయన ఈ మాటలు వారితో చెబుతూ ఉండగానే ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, “నా కూతురు ఇప్పుడే చనిపోయింది. అయినా నీవు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే ఆమె బతుకుతుంది” అన్నాడు. 19అప్పుడు యేసు లేచి అతని వెంట వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా వెళ్ళారు.

20
This verse is empty because in this translation its contents have been moved to form part of verse Mat 9:21.
In this translation, this verse contains text which in some other translations appears in verses Mat 9:20-Mat 9:21.
21అప్పుడే పన్నెండేళ్ళ నుండి ఆగని రక్త స్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనకగా వచ్చి, “నేను ఆయన వస్త్రం అంచును తాకితే బాగుపడతాను” అని తనలో తాను అనుకొని, ఆయన పైవస్త్రం కొనను తాకింది. 22యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, “అమ్మాయ్, ధైర్యంగా ఉండు. నీ నమ్మకం నిన్ను బాగుచేసింది” అన్నాడు. అదే క్షణంలో ఆ స్త్రీ బాగుపడింది.

23అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినపుడు అక్కడ వాయిద్యాలు వాయించే వారినీ గోల చేస్తున్న గుంపునూ చూశాడు. 24“వెళ్ళిపోండి. ఈ అమ్మాయి చనిపోలేదు. నిద్రపోతూ ఉంది” అన్నాడు. అయితే వారు నవ్వి ఆయనను హేళన చేశారు.

25ఆయన ఆ గుంపును బయటకు పంపివేసి, లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ పాప లేచింది. 26ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకిపోయింది.

ఇద్దరు గుడ్డివారికి చూపు

27యేసు అక్కడనుంచి వెళ్తూ ఉంటే ఇద్దరు గుడ్డివారు ఆయనను అనుసరిస్తూ, “దావీదు కుమారా, మామీద దయ చూపించు” అని కేకలు వేశారు. 28యేసు ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు. యేసు వారితో, “నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా?” అని వారిని అడిగాడు. వారు, “అవును ప్రభూ” అన్నారు.

29అప్పుడాయన వారి కళ్ళు ముట్టి, “మీరు నమ్మినట్టే మీకు జరుగుతుంది” అన్నాడు. 30వారి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు యేసు “ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకండి“అని ఖండితంగా వారికి చెప్పాడు. 31కానీ ఆ ఇద్దరూ వెళ్లి ఈ వార్త ఆ ప్రాంతమంతా చాటించారు.

32ఆ ఇద్దరూ వెళ్తుండగా కొంతమంది దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. 33దయ్యాన్ని వెళ్ళగొట్టిన తరువాత ఆ మూగవాడు మాటలాడాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడి, “ఇశ్రాయేలులో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు” అని చెప్పుకున్నారు. 34అయితే పరిసయ్యులు, “ఇతడు దయ్యాల రాజు మూలంగా దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు” అన్నారు.

గలిలయలో పరిచర్య (మార్కు 6:5,6)

35యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ, అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేస్తూ అన్ని పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేశాడు. 36ఆయన ప్రజాసమూహాలను చూసి వారి మీద జాలి పడ్డాడు. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల్లాగా నిస్పృహగా, చెదరిపోయి ఉన్నారు.

37ఆయన తన శిష్యులతో, “కోత చాలా ఎక్కువగా ఉంది. కానీ పని వారు తక్కువగా ఉన్నారు. కాబట్టి తన కోతకు కూలి వారిని పంపమని కోత యజమానిని బ్రతిమాలండి” అని తన శిష్యులతో చెప్పాడు.

38

Copyright information for TelULB